Banks: ప్రకృతి విపత్తులతో బ్యాంకులకు రూ.7.09 లక్షల కోట్ల నష్టం: సీడీపీ నివేదిక

Extreme weather conditions put banks at risk worth 7 trillion rupees

  • ఐదు బ్యాంకులపైనే రూ.6.19 లక్షల కోట్ల మేర ప్రభావం
  • ఒక్క ఎస్బీఐపైనే రూ.3.83 లక్షల కోట్ల మేర భారం
  • ఆ తర్వాత హెచ్ డీఎఫ్ సీకి రూ.1.79 లక్షల కోట్ల నష్టం
  • తుపాన్లు, వరదలతో పంట రుణాల చెల్లింపులపై ప్రభావం
  • బొగ్గు, విద్యుత్, చమురు, సిమెంట్ రంగాలతోనే భారీ నష్టాలు 

తుపాన్లు, వరదలు, కరవు వంటి ప్రకృతి విపత్తులతో బ్యాంకులకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వందలు కాదు.. వేలు కాదు.. లక్షల కోట్ల రూపాయల మేర బ్యాంకులపై అప్పుల భారం పెరుగుతుందట. వివిధ బ్యాంకులకు రూ.7.09 లక్షల కోట్ల మేర నష్టం కలుగుతుందట. సీడీపీ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. ఆ నివేదికను బుధవారం విడుదల చేసింది.

మొత్తంగా రూ.77.44 కోట్ల కోట్ల (106 లక్షల కోట్ల డాలర్లు) మేర ఆస్తులున్న 515 సంస్థల అభిప్రాయాలను సీడీపీ కోరింది. అందులో 220 చిన్నాపెద్ద సంస్థలు తమ అభిప్రాయాలు పంచుకున్నాయి. అందులో 67 బ్యాంకులుండగా.. ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, యెస్ బ్యాంక్ వంటి వాటికే సుమారు రూ.6.19 లక్షల కోట్ల మేర నష్టాలొస్తాయని నివేదిక పేర్కొంది.

సిమెంట్, బొగ్గు, చమురు, విద్యుత్ వంటి పర్యావరణ సున్నితమైన ప్రాజెక్టుల వల్లే బ్యాంకులకు ఎక్కువ నష్టం కలుగుతుందని పేర్కొంది. తుపాన్లు, వరదలతో పంట నష్టపోతే రుణాల చెల్లింపులు కష్టమైపోతాయని, బ్యాంకులకు నష్టాలొస్తాయని వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే ఎక్కువగా నష్టం కలుగుతుందని, దాదాపు రూ.3.83 లక్షల కోట్లు ప్రమాదంలో పడతాయని నివేదికలో సీడీపీ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని కార్మైఖేల్ బొగ్గు గనికి ఎస్బీఐ రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై మదుపరులు, షేర్ హోల్డర్ల నుంచి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆ విషయమెలా ఉన్నా.. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాజెక్టులకు రుణాలివ్వడం వల్ల సంస్థ పేరు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని సీడీపీతో ఎస్బీఐ తన అభిప్రాయాన్ని పంచుకుంది.

ఎస్బీఐ తర్వాత అత్యంత  ఎక్కువగా నష్టపోయే జాబితాలో ఉన్నది హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్. సంస్థపై ప్రకృతి విపత్తుల ప్రభావం 1.79 లక్షల కోట్ల రూపాయలుంటుందని.. సీడీపీకి తన అభిప్రాయం చెప్పింది సంస్థ. 2019 నుంచి ఇప్పటిదాకా ఆ విలువ 24 శాతం పెరిగిందని వెల్లడించింది.  ఇండస్ ఇండ్ కు రూ.46,600 కోట్లు, యాక్సిస్ కు రూ.7,500 కోట్లు, యెస్ బ్యాంకుకు రూ.2,000 కోట్ల మేర నష్టాలొస్తాయని సీడీపీ నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News