KTR: హైదరాబాదుకు ఐటీఐఆర్ ను తీసుకురాలేని బీజేపీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
- ఐటీఐఆర్ అంశంపై బండి సంజయ్ లేఖ
- సంజయ్ లేఖ నిండా అబద్ధాలేనన్న కేటీఆర్
- మీడియాలో ప్రచారం కోసమే లేఖ రాశారని వ్యాఖ్యలు
- దమ్ముంటే ఐటీఐఆర్ తీసుకురావాలని సవాల్
- బీజేపీ నైజం బట్టబయలైందని వెల్లడి
కాషాయదళంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ ను మూలకు నెట్టింది బీజేపీయేనని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ప్రకటనే నిదర్శనం అని అన్నారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ప్రకటనపై సమాచారం లేకపోవడం బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్ అంశంపై బండి సంజయ్ లేఖ రాసిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
ఐటీఐఆర్ అంశంలో బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర అని విమర్శించారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే లేఖ రాశారని, సిగ్గులేకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బట్టబయలైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీఐఆర్ అంశంలో ముందుకు రాని బీజేపీ... నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు.
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రంలో బెంగళూరు నగరంలోనే ఐటీఐఆర్ ఒక్కడుగు కూడా ముందుకు పోలేదని విమర్శించారు. "తెలంగాణలో ఐటీఐఆర్ పురోగతిపై తమను ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు... బెంగళూరులో ఐటీఐఆర్ ప్రాజెక్టు రాకపోవడానికి కూడా మా ప్రభుత్వమే కారణం అంటారా?" అని కేటీఆర్ నిలదీశారు. 2014 నుంచి రాసిన లేఖలను, అన్ని వివరాలతో సమర్పించిన ప్రాజెక్టు నివేదికలను బండి సంజయ్ కు ఇస్తామని, ఐటీఐఆర్ ను తీసుకురాగలరా? లేకపోతే ఐటీఐఆర్ కు సమానమైన మరో ప్రాజెక్టును తీసుకురాగలరా? అంటూ సవాల్ విసిరారు.