Sajjala Ramakrishna Reddy: నామినేషన్లు వేయడానికే మనుషులు దొరక్కపోతే ఇక శిబిరాలు ఎందుకు?: టీడీపీపై సజ్జల విసుర్లు
- ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- రాష్ట్రంలో భారీగా ఏకగ్రీవాలు
- టీడీపీ పనైపోయిందన్న సజ్జల
- టీడీపీపై నమ్మకం లేక నామినేషన్లకు ఎవరూ రావడంలేదని ఎద్దేవా
- ప్రజలు వైసీపీపై నమ్మకం ఉంచారని ఉద్ఘాటన
ఏపీలో ఇవాళ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తమ అభ్యర్థులను బెదిరించి నామినేషన్లు ఉపసంహరింపచేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అంతేకాదు, తమ అభ్యర్థులను ఎన్నికల వరకు కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో స్పందించారు.
నామినేషన్లకు ఎస్ఈసీ మరో అవకాశం ఇచ్చినా తెలుగుదేశం పార్టీపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. నామినేషన్లు వేయడానికే టీడీపీకి ఎవరూ దొరకని పరిస్థితుల్లో శిబిరాలు ఎందుకని ప్రశ్నించారు. మొన్నటి వరకు ఎస్ఈసీని వేనోళ్ల పొగిడిన టీడీపీ నేతలు, ఇవాళ విమర్శిస్తున్నారని సజ్జల అన్నారు. తమను బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు గొంతెత్తి అరిచినంత మాత్రాన వారు చెప్పే అబద్ధాలు నిజాలు అయిపోవని స్పష్టం చేశారు.
కుప్పంలో ఎప్పుడైతే చంద్రబాబు కంచుకోట బద్దలైందో, అప్పుడే రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని అభిప్రాయపడ్డారు. భారీగా ఏకగ్రీవాలతో ప్రజలు మరోసారి వైసీపీపై విశ్వాసం ఉంచారన్నది మున్సిపల్ ఎన్నికల సరళితో అర్థమవుతోందని పేర్కొన్నారు.