Andhra Pradesh: కులకట్టుబాట్లను పక్కనపెట్టి వేరొకరికి ఓటేశారని ఆరోపణ.. పది కుటుంబాలు వెలి!
- తాము చెప్పిన వ్యక్తికి ఓటేయలేదని సంఘ బహిష్కరణ
- తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలంలో ఘటన
- కలెక్టర్ తమ గోడు వినిపించుకోలేదని ఆరోపణ
- పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరిస్తామన్న ఎస్సై
తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం జగన్నాథగిరిలో దారుణం జరిగింది. కులకట్టుబాట్లను ధిక్కరించి తాము చెప్పిన వ్యక్తికి కాకుండా మరో అభ్యర్థికి ఓటు వేశారని ఆరోపిస్తూ పది కుటుంబాలను వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాగునీటి పరిస్థితిని పరిశీలించేందుకు కలెక్టర్ మురళీధర్ నిన్న కాజులూరు వచ్చారు. విషయం తెలిసిన బాధిత కుటుంబాలు ప్లకార్డులతో అక్కడికి చేరుకుని తమకు రక్షించాలని వేడుకున్నాయి. అయినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. తమ గోడు వినకుండానే కలెక్టర్ వెళ్లిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల 13న రెండో విడత ఎన్నికల్లో భాగంగా జగన్నాథగిరి పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. వైసీపీ మద్దతుతో ఒకరు, తిరుగుబాటు అభ్యర్థిగా మరొకరు బరిలో నిలిచారు. వైసీపీ మద్దతుతో నిలబడిన అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో ఓడిన వర్గం వారు, ఆయన తరపున పందెం కాసిన వారు తమపై కక్ష కట్టారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. కుల సమావేశానికి వెళ్లలేదన్న నెపంతో మహిళలు, పిల్లలను సంఘం పెద్దలు ఈడ్చుకెళ్లి దాడి చేశారని ఆరోపించారు. సంఘం నుంచి తమను వెలివేశారని, తిరిగి సంఘంలో చేరాలంటే ఒక్కో కుటుంబం రూ. 10 వేలు చెల్లించి, అంగీకార పత్రం ఇవ్వాలని ఆదేశించారని వాపోయారు.
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే కేసు నమోదు చేయలేదని, తిరిగి తమనే బెదిరించారని తెలిపారు. ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. కాగా, ఈ సమస్యను పెద్దల సమక్షంలో పరిష్కరిస్తామని గొల్లపాలెం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.