Anand Sai: ఆ ట్రైన్ కోసం నేనూ, పవన్ ఎదురుచూసేవాళ్లం: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి
- ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఆనంద్ సాయి
- బ్రైటెన్ ఇన్ స్టిట్యూట్ లో పవన్ తో పరిచయం అయిందని వెల్లడి
- ఏర్కాడ్ ఎక్స్ ప్రెస్ తమ స్నేహాన్ని పటిష్టం చేసిందన వివరణ
- తన బైక్ కు పవనే పెట్రోల్ కొట్టించేవాడని వ్యాఖ్యలు
ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్, యాదాద్రి నూతన ఆలయ డిజైనర్ ఆనంద్ సాయి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. హీరో పవన్ కల్యాణ్ తో తన పరిచయం, స్నేహం గురించి వివరించారు. చెన్నైలోని బ్రైటెన్ కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ లో తమకు పరిచయం ఏర్పడిందని తెలిపారు. అయితే, తమ స్నేహం బలపడింది మాత్రం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో అని చెప్పారు. కోయంబత్తూరు నుంచి వచ్చే ఏర్కాడ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కోసం వేచిచూసేవాళ్లమని, ఆ రైల్లో సినిమా వాళ్లు ఎక్కువగా వచ్చేవారని ఆనంద్ సాయి వివరించాడు.
"తన అన్నయ్య చిరంజీవి కోసం పవన్... మా నాన్న కోసం నేను ఆ రైల్వే స్టేషన్ లో వేచిచూస్తుండేవాళ్లం. అక్కడినుంచి మా ఇద్దరి స్నేహం మరింత ముందుకుపోయింది. నా వద్ద డబ్బులు లేవని గ్రహించి నా బైకులో పెట్రోల్ పవనే పోయించేవాడు. ఇద్దరం కలిసి చెన్నై అంతా చుట్టేసేవాళ్లం. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తితో ఇద్దరం హిమాలయాలకు కూడా వెళ్లాలనుకున్నాం కానీ వీలుకాలేదు. పవన్ కు సినిమా చాన్సులు రావడంతో హైదరాబాదు వెళ్లిపోయాడు. నేను చెన్నైలో ఉండిపోయాను" అని వివరించారు.