Venky Kudumula: ఇలాంటి నష్టం ఇంకెవరికీ జరగకూడదనే ఫిర్యాదు చేశా: దర్శకుడు వెంకీ కుడుముల
- భీష్మ చిత్రాన్ని నామినేట్ చేస్తానంటూ మోసం
- దర్శకుడు వెంకీ కుడుములకు టోకరా
- పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడు
- అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమేనని వెల్లడి
భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ఓ ఆన్ లైన్ మోసానికి గురైన సంగతి తెలిసిందే. భీష్మ చిత్రాన్ని అవార్డులకు నామినేట్ చేస్తామంటూ ఆయన నుంచి రూ.63,600 డిపాజిట్ చేయించుకున్న సైబర్ మోసగాడు, నగదు డిపాజిట్ కాలేదని, మరోసారి లావాదేవీ జరపాలని కోరడంతో దర్శకుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా, దర్శకుడు వెంకీ కుడుముల ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఈ విషయాన్ని ఎందుకు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడో, అందరికీ తెలిసేలా ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చిందో వివరించారు.
తనకు జరిగిన మోసం మరెవరికీ జరగకూడదని తాను భావించానని తెలిపారు. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులైనా, బయటివాళ్లయినా మోసగాళ్ల బారినపడకుండా చేయడమే తన ఉద్దేశమని వివరించారు. తప్పు జరిగినప్పుడు ఆ తప్పు మిగతావాళ్లకు కూడా జరగకూడదు అని ఫిర్యాదు చేయడంలో తప్పులేదని భావించానని పేర్కొన్నారు. పొగత్రాగుట, మద్యం సేవించుట మాత్రమే కాదు అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమేనని వెంకీ కుడుముల అభిప్రాయపడ్డారు. సమాజంలో ఏదైనా ఇలాంటి అవాంఛనీయ ఘటన ఏది జరిగినా వెంటనే ఎలుగెత్తి గళం వినిపించండి అని వెంకీ పిలుపునిచ్చారు.