Virat Kohli: అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటల యుద్ధం

Sledging between India and England players in Ahmedabad test
  • అహ్మదాబాద్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు
  • మొదట స్టోక్స్, సిరాజ్ మధ్య మాటల యుద్ధం
  • జోక్యం చేసుకున్న కోహ్లీ
  • అంపైర్ వచ్చినా వెనుదిరగని టీమిండియా కెప్టెన్
నాలుగు టెస్టుల సిరీస్ లో వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఆటగాళ్లు చివరి టెస్టులో నోటికి పని కల్పించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో బ్యాటింగ్ చేస్తున్న బెన్ స్టోక్స్ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మధ్య మొదట మాటల యుద్ధం మొదలైంది. ఈ వ్యవహారంలో తన బౌలర్ కు మద్దతుగా కెప్టెన్ కోహ్లీ ఎంటరవడంతో మైదానంలో వాడీవేడి వాతావరణం నెలకొంది.

అసలేం జరిగిందంటే.... స్టోక్స్ కు సిరాజ్ ఓ ప్రమాదకర బౌన్సర్ సంధించాడు. దాంతో స్టోక్స్ స్లెడ్జింగ్ కు తెరదీశాడు. నీ బౌలింగ్ ను చెండాడుతా అనే రీతిలో వ్యాఖ్యానించడంతో సిరాజ్ కూడా మాటకు మాట బదులిచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన కోహ్లీ వెంటనే అక్కడికి చేరుకుని స్టోక్స్ పై వాగ్యుద్ధానికి దిగాడు. చివరికి ఫీల్డ్ అంపైర్ వచ్చినా కోహ్లీ, స్టోక్స్ మధ్య మాటలవేడి చల్లారలేదు.

కాసేపటికి ఈ వివాదం సద్దుమణిగినా, తర్వాత సిరాజ్ మళ్లీ బౌలింగ్ కు వచ్చినప్పుడు కూడా స్లెడ్జింగ్ చోటుచేసుకుంది. ఆ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్టోక్స్ తో సిరాజ్ మాటల యుద్ధం నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli
Ben Stokes
Mohammed Siraj
Ahmedabad
Test

More Telugu News