India: భారత వ్యాక్సినేషన్ లో మైలురాయి... ఒక్క రోజులో 10 లక్షల మందికి పైగా టీకా!
- కరోనాను తరిమేయాలని పోరాటం
- నిన్న 10.93 లక్షల మందికి వ్యాక్సిన్
- వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
ఇండియా నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమేయాలని జరుగుతున్న పోరాటం మరో మైలురాయిని అందుకుంది. ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా టీకాను వేయించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. నిన్న రాత్రి 7 గంటల వరకూ 10.93 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించామని, జనవరి 16న వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన తరువాత, ఒకరోజులో ఇంతమందికి టీకాను అందించడం ఇదే తొలిసారని పేర్కొంది.
ప్రస్తుతం ఇండియాలో 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాను అందిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో టీకా సాధారణ పౌరులకూ అందుబాటులోకి వస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇండియాలో నమోదవుతున్న తాజా కేసుల్లో 85.51 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత 24 గంటల్లో 17,407 కేసులు నమోదు కాగా, అందులో 15 వేల వరకూ కేసులు ఈ రాష్ట్రాల్లోనే వచ్చాయి. అక్టోబర్ 18న 10,259 కేసులను నమోదు చేసిన మహారాష్ట్ర, ఆపై అత్యధికంగా నిన్న గురువారం నాడు 9,855 కేసులను నమోదు చేయడం గమనార్హం. ఆపై కేరళలో 2,765, పంజాబ్ లో 772 కేసులు వచ్చాయి.