Rahul Gandhi: తమిళనాడులో ప్రచారం చేయకుండా రాహుల్‌ను అడ్డుకోండి: ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- బ్రిటిష్ వారితో పోరాడినట్టు కేంద్రంతో పోరాడాలని రాహుల్ పిలుపునిచ్చారు
- ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
- దేశం కోసం మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాలంటూ యువతను రెచ్చగొట్టారు
- ఈసీకి చేసిన ఫిర్యాదులో బీజేపీ
యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించడమే కాకుండా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ తమిళనాడు బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా అడ్డుకోవడంతోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యవ్రత సాహూకు బీజేపీ నేతలు వినతిపత్రం అందించారు.
ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఈ నెల 1న కన్యాకుమారి జిల్లా ములగుమూడలోని ఓ పాఠశాల సముదాయంలో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని బీజేపీ తమిళనాడు వ్యవహారాల బాధ్యుడు వి.బాలచంద్రన్ ఆరోపించారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర ఉద్యమం చేయాలంటూ యువతను రాహుల్ రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఆంగ్లేయులతో పోరాడినట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారని, ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరామని బాలచంద్రన్ తెలిపారు.