Tirumala: ఉగాది నుంచి తిరుమలలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి: ఈఓ
- 72 గంటల ముందు కరోనా పరీక్ష తప్పనిసరి
- నెగటివ్ రిపోర్టును చూపించాల్సి వుంటుంది
- ఏప్రిల్ 15 తరువాత వయో వృద్ధులకు అనుమతి
- డయల్ యువర్ ఈఓలో జవహర్ రెడ్డి
రానున్న ఉగాది పర్వదినం నుంచి తిరుమల శ్రీవారి నిత్య ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉదయం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం జరుగగా, భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు జవహర్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. అయితే, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకుని, నెగటివ్ రిపోర్టును చూపించాల్సి వుంటుందని ఆయన అన్నారు.
ఏప్రిల్ 15 తరువాత వయోవృద్ధులు, చిన్న పిల్లలకు దర్శనాలను ప్రారంభించాలన్న యోచనలో ఉన్నామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. దాతలు సూచించిన వారి కుటుంబీకులు, మిత్రులకు దర్శనాలను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత దర్శనం టోకెన్ల కోటాను దశలవారీగా రోజుకు 40 వేలకు పెంచాలని భావిస్తున్నామని, తిరుమలకు వచ్చే వారంతా కరోనా నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు.
ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ శ్రీవారి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టీటీడీ తరఫున గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ కేంద్రానికి లేఖను రాశామని తెలిపారు. తిరుమలలో భౌతికదూరం, మాస్క్ లను ధరించడం వంటి నిబంధనలను భక్తులంతా విధిగా పాటించాలని సూచించారు.