YS Jagan: ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ‌ను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్

Jagan launces Fact Check Website
  • మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న జగన్
  • కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • వీటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని వ్యాఖ్య
ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయంలో వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియాలో, సోషల్ మీడియాలో దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఈ తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టేలా, ప్రజలకు వాస్తవాలను వివరించేలా ఏపీ ఫ్యాక్ట్ చెక్ పని చేస్తుందని చెప్పారు. తప్పుడు ప్రచారాలను ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందని తెలిపారు. సంస్థలు, మతాలు, కులాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచేలా పోస్టింగులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దురుద్దేశపూర్వకంగా జరిగే ప్రచారం ఎక్కడి నుంచి మొదలయిందో గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జగన్ అన్నారు. ఒక వ్యవస్థ లేదా ఒక వ్యక్తి ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదని హితవు పలికారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పథకాలను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని... దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి పనులకు ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని అన్నారు. వెబ్ సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎస్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
YS Jagan
YSRCP
Fact Check Web
Andhra Pradesh

More Telugu News