BJP: అసోంలో 92 స్థానాల్లో బీజేపీ పోటీ!

BJP To Contest 92 Seats In Assam

  • మిత్ర పక్షాలతో ఒప్పందం కుదిరిందన్న పార్టీ వర్గాలు
  • ఏజీపీకి 26, యూపీపీఎల్ కు 8 స్థానాలకు ఓకే
  • బీజేపీలో ఓ స్థానిక పార్టీ విలీనం
  • ఆ పార్టీ నుంచి ఒకరిద్దరు బీజేపీ గుర్తుపైనే పోటీ
  • 84 మందితో బీజేపీ తొలి జాబితా సిద్ధం

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అసోంలో మిత్ర పక్షాలతో బీజేపీ సీట్ల పంపకం చివరి అంకానికి చేరింది. అన్ని భాగస్వామ్య పక్షాలతో పోటీ చేసే సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 126 స్థానాలకు గానూ 92 సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది. మిగతా వాటిలో 26 సీట్లలో అసోం గణ పరిషద్ (ఏజీపీ), 8 స్థానాల్లో యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) పోటీ చేయనున్నాయి.

కాగా, స్థానిక పార్టీ ఒకటి బీజేపీలో విలీనం అయిందని, ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు అభ్యర్థులు బీజేపీ గుర్తుపైనే పోటీ చేస్తారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, 84 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బరిలో నిలిచిన అభ్యర్థులను ఈ రోజు ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.

ఇక, ఏజీపీ వ్యవస్థాపకుడు, అసోంకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రఫుల్ల కుమార్ మహంతకు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ప్రస్తుతం ఢిల్లీలోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. పౌరసత్వ చట్టంపై ఆయన వ్యతిరేక గళం వినిపించడంతో పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే, ఎన్నికల లోపు ఆయన కోలుకుని పార్టీ వ్యవహారాల్లో పాల్గొంటే.. కచ్చితంగా చీలిక వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 కాగా, గత ఎన్నికల్లో 84 సీట్లలో పోటీ చేసిన బీజేపీ.. 60 సీట్లను గెలుచుకుంది. 2011లో గెలిచిన స్థానాల కన్నా 55 ఎక్కువ స్థానాలను ఖాతాలో వేసుకుంది.

  • Loading...

More Telugu News