Amaravati Lands: సుప్రీంకోర్టులో అమరావతి భూముల పిటిషన్ పై విచారణ... సీబీఐ దర్యాప్తుకు అభ్యంతరం లేదన్న ఏపీ సర్కారు
- అమరావతి భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు
- సిట్ దర్యాప్తుపై స్టే ఇచ్చిన హైకోర్టు
- హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన ఏపీ సర్కారు
- గత కొన్నినెలలుగా విచారణ
అమరావతి భూముల అంశంలో దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా ఏపీ సర్కారు స్పందిస్తూ... విచారణ పేరుతో బలవంతపు చర్యలు ఉండవని స్పష్టం చేసింది. కోర్టు పర్యవేక్షణలోనే విచారణ జరిపేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. సీబీఐతో దర్యాప్తు చేసేందుకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి వెల్లడించింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణలో అన్ని అంశాలను పరిశీలిస్తామని, ఈసారి పూర్తిస్థాయి విచారణ ఉంటుందని తెలిపింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించగా, ఏపీ హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంను ఆశ్రయించడం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో కొనసాగుతోంది.