Athletics Coach: భారత రన్నింగ్​ కోచ్​ హఠాన్మరణం.. హాస్టల్ గదిలో ప్రాణాలొదిలిన నికోలై

Athletics coach Nikolai found dead at NIS

  • పంజాబ్ఎ లోని న్ఐఎస్ హస్టల్ గదిలో నికోలై కన్నుమూత
  • సమావేశానికి రాకపోవడంతో గదిని పరిశీలించిన తోటి కోచ్ లు
  • కాళ్లకు ఉన్న షూ ఉన్నట్టే ప్రాణాలు వదిలిన స్నెసారెవ్

భారత రన్నింగ్ కోచ్ నికోలై స్నెసారెవ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. శుక్రవారం పంజాబ్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లోని హాస్టల్ గదిలో విగత జీవిగా పడి ఉన్నారని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) తెలిపింది. శుక్రవారం నిర్వహించిన ఇండియన్ గ్రాండ్ ప్రి 3కి ఆయన బెంగళూరు బేస్ నుంచి ఎన్ఐఎస్ కు వచ్చారని ఏఎఫ్ఐ అధ్యక్షుడు అదిలె సుమారివాలా చెప్పారు.

మీటింగ్ కు ఆయన హాజరు కాకపోవడంతో తోటి కోచ్ లు హాస్టల్ గదికి వెళ్లి చూశారని, ఎంతకీ తలుపులు తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా చనిపోయి కనిపించారని చెప్పారు. కాళ్లకు షూస్ కూడా అలాగే ఉన్నాయన్నారు. ఎలా చనిపోయారన్నది తెలియలేదని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుందని అన్నారు. కాగా, శుక్రవారం ఉదయమే ఆయన ఎన్ఐఎస్ రన్నింగ్ ట్రాక్ ను పరిశీలించారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఒలింపిక్స్ కు అర్హత సాధించిన స్టీపుల్ చేజర్ (హర్డిల్స్ రన్నింగ్) అవినాష్ సేబుల్,  మధ్యస్థ, సుదూర పరుగు పోటీల్లో ఒలింపిక్స్ అర్హత సాధించడం కోసం మరికొందరూ ఆయన దగ్గరే శిక్షణ పొందుతున్నారు. కాగా, భారత కోచ్ గా ఆయన ప్రయాణం 2005లో ప్రారంభమైంది. 10 వేల మీటర్ల రన్నర్లు ప్రీజా శ్రీధరన్, కవితా రౌత్ లకు ఆయన శిక్షణ ఇచ్చారు. 2010 ఏషియా గేమ్స్ లో వారిద్దరూ మొదటి రెండు స్థానాల్లో నిలవడానికి కృషి చేశారు. 25 ల్యాప్ ల పరుగు పందెంలో భారత్ కు పతకాలు రావడం అదే తొలిసారి.

2010 ఏషియా గేమ్స్ లో బంగారు పతకం సాధించిన సుధా సింగ్ ను కూడా ఆయనే రాటు దేల్చారు. ఆ తర్వాత లలితా బబ్బర్ ను స్టీపుల్ చేజ్ వైపు మళ్లించారు. ఆయన తర్పీదులోనే 2016 రియో ఒలింపిక్స్ ఫైనల్స్ కు లలిత అర్హత సాధించింది. 1984లో పీటీ ఉష తర్వాత ఒలింపిక్స్ ఫైనల్స్ కు చేరిన తొలి భారత అథ్లెట్ లలితనే. కాగా, ఆయన సొంత దేశం బెలారస్. కాగా, ఆయన మృతి పట్ల కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు, పీటీ ఉష సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News