Chandrababu: ఏబీసీడీ.. జగన్ ప్రభుత్వ విధానం ఇదే: చంద్రబాబు
- పోస్కో కంపెనీతో కలిసి పగటి వేషగాళ్లు డ్రామాలు ఆడుతున్నారు
- ఏప్రిల్ 1 నుంచి ఇంటి పన్ను పెంచుతున్నారు
- ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్న అంశంపై మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. పోస్కో కంపెనీతో చేతులు కలిపిన పగటి వేషగాళ్లంతా డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఏబీసీడీ అనే పాలసీని తీసుకొచ్చిందని... ఏబీసీడీ అంటే అటాక్, బర్డెన్, కరప్షన్, డిస్ట్రక్షన్ అని అన్నారు.
ఒక వైపు నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మద్యం అమ్మకాలను చూపెడుతూ నెలకు రూ. 5 వేల కోట్ల అప్పు చేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటి పన్నులను కూడా పెంచుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
2029 కల్లా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ చేయాలని భావించానని... దీనికి అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టానని చంద్రబాబు చెప్పారు. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర పరిస్థితి తలకిందులు అయిందని అన్నారు. తనకు పదవులు అవసరం లేదని... ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించానని, అది తనకు చాలని చెప్పారు.
స్థానిక ఎన్నికల్లో ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు ఇవ్వబోమని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని... పరిపాలన అంటే ఇదేనా? అని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని నాశనం చేశారని... ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని అన్నారు. ఏదో ఒక రోజు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి రాష్ట్రానికి వస్తుందని... అప్పుడు ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా వసూళ్ల పర్వమే నడుస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో ఎక్కడైనా వసూళ్లు జరిగాయా? అని ప్రశ్నించారు. విశాఖలో ప్రజలను బెదిరించి భూములను లాక్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే... మీ ఇంటిని కూడా లాక్కొంటారని హెచ్చరించారు. రౌడీలు, గూండాల నుంచి విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు.