Surat: 122 సిమీ అనుమానిత ఉగ్రవాదులు నిర్దోషులన్న గుజరాత్ కోర్టు!

122 Accused of SIMI Terror Outfit Acquited by Court

  • 2001లో సూరత్ లో సమావేశం
  • అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు
  • సరైన సాక్ష్యాలు లేవన్న న్యాయస్థానం

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో 2001లో అరెస్ట్ కాబడిన 122 మందినీ నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్టు గుజరాత్ లోని సూరత్ కోర్టు తీర్పిచ్చింది. వీరంతా నిషేధిత ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) సభ్యులని చార్జ్ షీట్ దాఖలు కాగా, వీరికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేదని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఏఎన్ దావే అభిప్రాయపడ్డారు. సూరత్ లో డిసెంబర్ 2001లో ఓ సమావేశానికి హాజరైన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు వ్యక్తులు విచారణ కొనసాగుతున్న సమయంలో కన్నుమూశారు.

వీరంతా సిమీ సంస్థకు చెందినవారేనని కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేక పోయిందని, వీరు ఇండియాలో ఉగ్రవాద కార్యకలాపాలను  విస్తరించేందుకు సమావేశమయ్యారనడానికి కూడా సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 28, 2001లో సూరత్ పరిధిలోని అథావలైన్స్ పోలీసులు మొత్తం 127 మందిని సగ్రామ్ పురా సిటీ హాల్ లో అరెస్ట్ చేశారు. వారిపై యూఏపీఏ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ అయ్యాయి. అదే సంవత్సరం సెప్టెంబర్ లో సిమీని నిషేధిస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది.

అరెస్ట్ కాబడిన వారంతా గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారు. వారంతా కోర్టులో తమ వాదన వినిపిస్తూ, తామేమీ సిమీ సభ్యులం కాదని, ఆల్ ఇండియా మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్టు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనేందుకు సూరత్ వచ్చామని, పోలీసులు తప్పుడు కేసు పెట్టారని వాదించారు.

  • Loading...

More Telugu News