Prime Minister: ‘మోదీ దుకాణం’లో శానిటరీ ప్యాడ్ రెండున్నర రూపాయలే: ప్రధాని మోదీ
- పేదల కోసమే జన ఔషధిని ప్రారంభించామన్న మోదీ
- వాటితో యువతకూ ఉపాధి లభిస్తోందని వ్యాఖ్య
- మేఘాలయలో 7,500వ జన ఔషధి ప్రారంభం
ప్రాణాధార ఔషధాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఔషధాలను ప్రజలకూ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా జన ఔషధి పథకాన్ని ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ఔషధ దుకాణాలతో పేదలు డబ్బు ఆదా చేసుకోవచ్చని అన్నారు.
ప్రజలు ‘మోదీ దుకాణం’ అని పిలుచుకునే జన ఔషధిల్లోనే మందులు కొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో దేశంలోని 7,500వ జన ఔషధిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి మాట్లాడారు.
వీటి ద్వారా మహిళలు శానిటరీ ప్యాడ్లను కేవలం రెండున్నర రూపాయలకే కొనుగోలు చేయవచ్చన్నారు. ‘‘పేద, మధ్యతరగతి ప్రజల కోసం దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి జన ఔషధి పథకాన్ని అమలు చేస్తున్నాం. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి.
75 ఆయుష్ మందులనూ దేశంలోని అన్ని జన ఔషధి కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మోదీ చెప్పారు. కాగా, కార్యక్రమంలో జన ఔషధి ద్వారా లబ్ధి పొందుతున్న వారితో ప్రధాని మాట్లాడారు. వారి అనుభవాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.