Ganta Srinivasa Rao: నేను పనిచేసిన నాయకుల్లో చంద్రబాబు ది బెస్ట్... కానీ ఓసారి తేడా వచ్చింది: గంటా శ్రీనివాసరావు
- గంటా పార్టీ మారుతున్నాడంటూ ఇటీవల వార్తలు
- ఇదే మాట చెప్పిన విజయసాయి
- చంద్రబాబుతో తనకు ఎంతో అనుబంధం ఉందన్న గంటా
- విశాఖ ఎమ్మెల్యే సీటు విషయంలో కాస్త గ్యాప్ వచ్చిందని వెల్లడి
- ఫలితాల తర్వాత తాను చంద్రబాబును ఎక్కువగా కలవలేదని వివరణ
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారంటూ గత ఎన్నికల సమయం నుంచి వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా గంటా వైసీపీలోకి వస్తున్నాడని చెప్పడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా చానల్ గంటాను వివరణ కోరింది. తనపై ఇప్పుడే కాదు, గతంలోనూ చాలాసార్లు పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చాయని గంటా వెల్లడించారు.
తన అనుచరుడు కాశీ విశ్వనాథ్ వైసీపీలోకి వెళ్లడంపై ఆయన స్పందిస్తూ... కాశీ విశ్వనాథ్ ఒక్కడే తనకు అనుచరుడు కాదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో చాలామంది పార్టీలు మారారని, ఒకవేళ తాను పార్టీ మారాలనుకుంటే వాళ్లతోనే కలిసి వెళ్లేవాడ్నని, వాళ్లను ముందు పంపి, తాను వెనుక వెళ్లాల్సిన అవసరం లేదని గంటా వివరించారు.
తాను ఇప్పటివరకు పనిచేసిన నాయకుల్లో ది బెస్ట్ చంద్రబాబేనని స్పష్టం చేశారు. అయితే, 2019 ఎన్నికల సమయంలో చిన్న తేడా వచ్చిందని అన్నారు. 1999లో ఎంపీ అయినప్పటి నుంచి చంద్రబాబుతో ఎంతో అనుబంధం ఉందని, 2009లో ఓసారి తాను ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లానని వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో నారా లోకేశ్ విశాఖలో పోటీ చేయాలనుకున్నాడని, దాంతో తనను ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని గంటా వివరించారు.
అయితే లోకేశ్ విశాఖ నుంచి పోటీ చేయకపోవడంతో, తాను ఎంపీగా పోటీ చేయడం విరమించుకుని ఎమ్మెల్యే బరిలో దిగానని, ఈ అంశంలోనే చంద్రబాబుతో పొరపొచ్చాలు వచ్చాయని, బహుశా ఇది కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే అయ్యుంటుందని గంటా వివరించారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తాను చంద్రబాబును పెద్దగా కలవలేదని, దాంతో తమ మధ్య కొంత ఎడం పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు.