PV Ramesh: రాజకీయ దుమారం రేపుతున్న జగన్ మాజీ సలహాదారు పీవీ రమేశ్ ట్వీట్
- వరవరరావు కొటేషన్ ను ఉటంకిస్తూ ట్వీట్
- కామెంట్లతో హోరెత్తిపోయిన ట్విట్టర్
- ఓ కవితలో అది భాగమంటూ సాయంత్రం మరో ట్వీట్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ నిన్న చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమేశ్ గతేడాది చివరిలో పదవికి రాజీనామా చేశారు.
‘‘నేరమే అధికారమై ప్రజలను నేరస్థులను చేసి వెంటాడుతుంటే ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్థుడే’’ అన్న వరవరరావు కొటేషన్ ను ఉటంకిస్తూ పీవీ రమేశ్ నిన్న ఉదయం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇటు రాజకీయంగానూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపుతోంది.
ఆయనకు మద్దుతుగా ట్విట్టర్ హోరెత్తిపోతోంది. అందులో ఇన్నాళ్లూ మీరు కూడా భాగంగా ఉన్నారంటూ మరికొందరు ఆయనపై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. వరుస కామెంట్లతో ఉక్కిరిబిక్కిరి ఆయన రమేశ్ సాయంత్రం మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.
తాను చేసిన ట్వీట్ ఏ ప్రభుత్వానికి, వ్యక్తులకు సంబంధించినది కాదని, ఓ కవితలో భాగమేనంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, విశ్వజనీనమైన, కాలాతీతమైన సత్యాలను వ్యక్తిగతంగా ఆపాదించేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు. అలా చేస్తే కనుక మీ ఆలోచనా శక్తి అక్కిడికే పరిమితమైందిగా భావించాల్సి వస్తుందని కాస్తంత ఘాటుగా పేర్కొన్నారు.