Jagan: మహిళ అంటే ఆకాశంలో సగం... వారు అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవు: సీఎం జగన్
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- క్యాంపు కార్యాలయంలో వేడుకలు
- మహిళలను అందలం ఎక్కించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్న సీఎం
- 21 నెలల కాలంలో అనేక పథకాలు తీసుకువచ్చామని వెల్లడి
- రూ.80 వేల కోట్లు అందించామని వివరణ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళ అంటే ఆకాశంలో సగభాగం అని కొనియాడారు. కుటుంబానికి చుక్కానిలా వ్యవహరిస్తూ మహిళలు అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవని స్పష్టం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
గత 21 నెలల కాలంలో మహిళా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని వెల్లడించారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, కాపు నేస్తం, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, మహిళల పేరిట ఇళ్ల స్థలం, నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు తదితర పథకాలు తీసుకువచ్చామని సీఎం జగన్ వివరించారు.
ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు విద్య అందడంలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మ ఒడి పథకం కింద ఇచ్చామని, ఐదేళ్లలో రూ.32,500 కోట్లు అమ్మ ఒడి కింద ఇస్తామని స్పష్టం చేశారు.
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.4,604 కోట్లు ఇచ్చామని, ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా మహిళలకు రూ.27 వేల కోట్ల విలువైన ఆస్తిని అందజేశామని వివరించారు. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80 వేల కోట్లు అందించామని సీఎం జగన్ తెలిపారు.
మహిళా ఉద్యోగుల సాధారణ సెలవులను 20 రోజులకు పెంచామని తెలిపారు. మహిళల భద్రత కోసం 13 జిల్లాల్లో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, మహిళలపై నేరాలను దిశ చట్టం ద్వారా సత్వరమే విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.