WTC: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మార్పు
- ఇంగ్లండ్ పై సిరీస్ గెలిచిన భారత్
- డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత
- ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ లో అని వార్తలు
- టైటిల్ పోరు సౌతాంప్టన్ లో జరుగుతుందన్న గంగూలీ
- వేదిక మార్పు నిర్ణయం ఎప్పుడో జరిగిందని వెల్లడి
ఇటీవల ఇంగ్లండ్ పై 3-1తో టెస్టు సిరీస్ చేజిక్కించుకున్న భారత్ ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ చేరడం తెలిసిందే. న్యూజిలాండ్ జట్టుతో జూన్ 18 నుంచి 22 వరకు జరిగే అంతిమ సమరంలో టీమిండియా పోరాడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లండ్ లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా నిలుస్తుందని ఇప్పటివరకు భావించారు.
అయితే టెస్టు చాంపియన్ షిప్ ఆఖరిపోరాటానికి లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వబోవడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు. ఈ టైటిల్ మ్యాచ్ కు సౌతాంప్టన్ వేదికగా నిలుస్తోందని వెల్లడించారు. వేదిక మార్పుపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, గంగూలీ మాత్రం సౌతాంప్టన్ లో జరిగే టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు తాను హాజరవుతున్నట్టు తెలిపారు. సౌతాంప్టన్ వేదికగా ఫైనల్ పోరుకు నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారని పేర్కొన్నారు.