Nara Lokesh: విజయవాడలో జరిగింది కుటుంబ స్పర్ధ లాంటిదే... మూడు గంటల్లోనే పరిష్కరించుకున్నాం: నారా లోకేశ్
- ఇటీవల విజయవాడ టీడీపీలో విభేదాలు
- కేశినేని నాని వర్సెస్ బుద్ధా, బోండా ఉమ
- మళ్లీ కలిసిపోయిన నేతలు
- కుటుంబంలో కలతలు సాధారణమేనన్న లోకేశ్
- టీడీపీ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
ఇటీవల బెజవాడ టీడీపీలో టీ కప్పులో తుపాను తరహాలో చిరు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. కేశినేని నాని వర్గం ఓవైపు... బుద్ధా వెంకన్న, బోండా ఉమ తదితర నేతలు ఓ వైపు అన్నట్టుగా తయారైంది. అయితే, ఉదయం సవాళ్లు విసురుకున్న నేతలు సాయంత్రానికి ఐక్యతా రాగం ఆలపించారు. చంద్రబాబు సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు.
టీడీపీ ఓ కుటుంబం వంటిదని, చిన్న చిన్న విభేదాలు రావడం సహజమేనని అన్నారు. విజయవాడలో జరిగింది కూడా పెద్ద ఘటనేమీ కాదని తెలిపారు. దీన్నో కుటుంబ స్పర్ధలాగే చూశామని, కేవలం 3 గంటల్లోనే సమస్యను పరిష్కరించుకున్నామని పేర్కొన్నారు.
ఇక, వైసీపీ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో దరిద్రపు పాదం ఉందని ప్రజలు భావిస్తున్నారని, టీడీపీ మళ్లీ అధికారం చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. 21 నెలలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.