rakesh tikayat: ల‌క్ష ట్రాక్ట‌ర్ల‌తో పార్ల‌మెంటును ముట్ట‌డిస్తాం: రాకేశ్ తికాయిత్ హెచ్చరిక‌

rakesh slams nda govt

  • కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల్సిందే
  • ట్రాక్టర్ల‌న్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావు
  • కేంద్ర వ్యవసాయ మంత్రికి అధికారాలు లేవు
  • సొంతంగా రైతుల‌కు ఎప్పుడూ సమాధానం ఇవ్వలేరు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతులు చేస్తోన్న ఆందోళ‌న కొన‌సాగుతోంది. గ‌ణ‌తంత్ర దినోత్సవం నాడు రైతులు ట్రాక్ట‌ర్లతో పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు దిగ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే.

అయితే,  త‌మ డిమాండ్‌ను నెర‌వేర్చ‌క‌పోతే మ‌రోసారి ల‌క్ష‌లాది ట్రాక్ట‌ర్ల‌తో నిర‌స‌న తెలుపుతామ‌ని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్ హెచ్చ‌రించారు. ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధమ‌ని ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయ‌న మాట్లాడుతూ...  తాము జ‌న‌వ‌రి 26న 3,500 ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించామ‌ని గుర్తు చేశారు. ఆ ట్రాక్టర్ల‌న్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావని చెప్పారు.

మధ్యప్రదేశ్ బీజేపీ నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్ కు ఎలాంటి అధికారాలు లేవని ఆయ‌న ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆయన సొంతంగా రైతుల‌కు ఎప్పుడూ సమాధానం ఇవ్వలేరని చెప్పారు. చర్చలకు కూడా ప‌లు ప‌త్రాలు పట్టుకుని వస్తార‌ని, వాటి ఆధారంగానే రైతుల‌కు సమాధానాలు ఇస్తారని ఎద్దేవా చేశారు.  

కాగా, మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా ఈ నెల 14న రెవాలో, మార్చి 15న జబల్‌పూర్‌ ప్రాంతాల్లో  రైతు ర్యాలీల్లో రాకేశ్ పాల్గొంటారు. అనంత‌రం తెలంగాణ‌తో పాటు ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, కర్ణాటకకు ఆయ‌న వ‌చ్చి రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతారు.

  • Loading...

More Telugu News