Nara Lokesh: అమలాపురంలో బైరిశెట్టి రేణుక ధైర్యానికి సలామ్: నారా లోకేశ్
- తనను ఓ వైసీపీ నేత కుమారుడు మోసం చేశాడన్న యువతి
- పోలీసులకు ఫిర్యాదు చేస్తే రేప్ కేసు నమోదు చేశారని వెల్లడి
- ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న యువతి
- ఆమెకు ఓ అన్నగా అండగా ఉంటాన్న లోకేశ్
- ఆమెను మోసం చేసినవాడ్ని శిక్షించాలని డిమాండ్
అమలాపురంకు చెందిన బైరిశెట్టి రేణుక అనే యువతి ధైర్యం తనను ఆకట్టుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను లోకేశ్ పంచుకున్నారు.
ఆ వీడియోలో రేణుక మాట్లాడుతూ ఓ వైసీపీ నేత కుమారుడు తనను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపించింది. పోలీస్ స్టేషన్ కు వెళితే రేప్ కేసుగా నమోదు చేశారని కన్నీటిపర్యంతమైంది. తనకు వ్యతిరేకంగా పైస్థాయి నుంచి రాజకీయ జోక్యం ఉందని ఆమె ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ప్రస్తుతం తాను అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా పోటీచేస్తున్నట్టు వెల్లడించింది.
దీనిపై లోకేశ్ స్పందిస్తూ... బైరిశెట్టి రేణుక ధైర్యానికి సలామ్ అని పేర్కొన్నారు. వైసీసీ రాక్షసులపై ఆమె పోరాటానికి ఓ అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్యాయం జరిగిందని ఆమె ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, బుల్లెట్ లేని జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు. స్వయంగా మంత్రులే మృగాళ్లను కాపాడేందుకు రంగంలోకి దిగితే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. 21 రోజుల్లోనే బాధిత మహిళకు న్యాయం చేస్తామన్నారని, కానీ 21 నెలలు అయినా ఒక్క మహిళకూ న్యాయం జరగలేదని నారా లోకేశ్ విమర్శించారు.
జగన్ రెడ్డి హయాంలో తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని ఆ అమ్మాయి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రేణుకను మోసం చేసినవాడిని కఠినంగా శిక్షించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.