Supreme Court: అత్తగారింట ఉన్నప్పుడు మహిళపై దాడి జరిగితే అందుకు భర్తదే బాధ్యత: సుప్రీంకోర్టు
- భర్తతో సహా అత్తింటివారు హింసిస్తున్నారన్న మహిళ
- గతేడాది పోలీసులకు ఫిర్యాదు
- ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్లిన భర్త
- హైకోర్టులో చుక్కెదురు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనం
- బాగా తలంటిన సీజేఐ!
పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరుపుతూ సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భార్యకు తగిలిన గాయాలకు తాను కారకుడ్ని కాదని, తన తండ్రి వల్ల ఆమెకు గాయాలయ్యాయని ఆ వ్యక్తి పిటిషన్ లో వివరించాడు. తన తండ్రి వల్ల అయిన గాయాలకు తనను ఎలా బాధ్యుడ్ని చేస్తారన్న ఆ వ్యక్తి, ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం... అత్తగారింట ఉన్నప్పుడు ఓ మహిళపై ఆ ఇంట్లోవాళ్లు ఎవరు దాడిచేసినా అందుకు భర్తదే బాధ్యత అని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సీజేఐ ఎస్ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వేం మనిషివంటూ మండిపడింది. "భార్యను క్రికెట్ బ్యాట్ తో కొడతావా? నువ్వు కొట్టడం వల్లే అబార్షన్ అయిందని ఆమె చెబుతోంది. తనను చంపడానికి యత్నించావని అంటోంది. అత్తగారింట ఇతర కుటుంబ సభ్యులు చేసిన దాడిలో భార్య గాయపడితే ప్రధాన బాధ్యత వహించాల్సింది భర్తే" అని వ్యాఖ్యానించింది.
2020 జూన్ లో పంజాబ్ లుథియానాకు చెందిన ఓ మహిళ తనను భర్తతో పాటు అత్తింటివారు హింసిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె భర్త తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ నిరాశ ఎదురైంది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.