Mamata Banerjee: ఇవాళ నేను పరాయిదాన్ని అయిపోయానా... గుజరాత్ నుంచి వచ్చేవాళ్లు స్థానికులా?: మమతా బెనర్జీ

Mamata Banarjee take jibe at Suvendu Adhikari in Nandigram
  • నందిగ్రామ్ లో మమత వర్సెస్ సువేందు
  • తాను ఈ గడ్డపై పుట్టానన్న సువేందు
  • మమత ఓ బయటి వ్యక్తి అని వ్యాఖ్యలు
  • తానెలా బయటి వ్యక్తిని అవుతానన్న మమత
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నందిగ్రామ్ లో ఆమె ప్రత్యర్థి, బీజేపీ నేత సువేందు అధికారి తన ప్రచారంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ కు మమతా బెనర్జీ ఓ పరాయి వ్యక్తి అని అన్నారు. తాను ఈ గడ్డపై పుట్టినవాడ్నని, ముఖ్యమంత్రి ఓ బయటి వ్యక్తి అని విమర్శించారు.

 దీనిపై మమత దీటుగా స్పందించారు. తాను పరాయి వ్యక్తిని అయితే, గుజరాత్ నుంచి వచ్చినవారు స్థానికులా? అంటూ పరోక్షంగా మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

"నందిగ్రామ్ లో నన్ను కొందరు బయటి వ్యక్తి అని పిలుస్తుండడం విస్మయం కలిగిస్తోంది. నేను పొరుగునే ఉన్న బిర్భూమ్ జిల్లాలోనే పుట్టి, పెరిగాను. కానీ నన్ను పరాయి వ్యక్తి అని పిలుస్తున్న వ్యక్తి కూడా ఇక్కడ పుట్టలేదు. అలాంటివాళ్లు కూడా నన్ను బయటి వ్యక్తిని చేసేస్తున్నారు. గుజరాత్ నుంచి వచ్చినవాళ్లు మాత్రం స్థానికులు అయిపోతున్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

నేడు తన ప్రచారం ప్రారంభించిన మమత మాట్లాడుతూ, తాను నందిగ్రామ్ ను ఎన్నటికీ మర్చిపోనని, కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నారు. "మీరు వద్దంటే నేను నామినేషన్ దాఖలు చేయను. కానీ మీరు నన్ను మీ పుత్రికగా భావిస్తే నామినేషన్ వేస్తాను" అని నందిగ్రామ్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Mamata Banerjee
Suvendu Adhikari
Outsider
Insiders
Nandigram
West Bengal

More Telugu News