Municipal Elections: బిర్యానీ పొట్లంలో ముక్కుపుడకలు.. ఓటర్లకు గాలం వేస్తూ దొరికిన నంద్యాల స్వతంత్ర అభ్యర్థి
- 12వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామసుందర్‌లాల్
- 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలు, నగదు స్వాధీనం
- అభ్యర్థి సహా మరో ముగ్గురిపై కేసు నమోదు
మునిసిపల్ ఎన్నికల్లో నంద్యాలలోని 12వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తూ దొరికిపోయాడు. ఖండే శ్యామసుందర్‌లాల్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఓటర్లను ఆకర్షించి ఓట్లు పొందడానికి బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి పంచుతూ దొరికిపోయాడు. కర్ణాటక నుంచి కొందరిని కిరాయికి పిలిపించుకున్న శ్యామసుందర్ నిన్న బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి వారితో పంపిణీ చేయించాడు.
విషయం పోలీసుల చెవిన పడడంతో వారు రంగంలోకి దిగారు. బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న రాఘవేంద్రస్వామి, రవికరణ్, మోహన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, రూ. 55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. వారితో ఈ పనిచేయించిన శ్యామసుందర్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.