Suvendu Adhikari: హిందూ మంత్రాలను మమత తప్పుగా పఠిస్తున్నారు: సువేందు అధికారి విమర్శలు
- ఇన్షా అల్లా, ఖుదా హఫీజ్ వదిలేశారు
- హిందూ ధర్మాన్ని జపిస్తున్నారు
- హిందూ దేవతలను తిట్టిన వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారు?
- ఎన్నికల్లో తృణమూల్ రిగ్గింగ్ చేసే ముప్పు
తాను హిందూ బ్రాహ్మణురాలిని అని చెప్పుకొని, చాందీ పఠనం చేసిన మమతపై బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు. ఆమె హిందూ మంత్రాలను తప్పుగా పఠిస్తున్నారని ఆరోపించారు. బుధవారం నందిగ్రామ్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తృణమూల్ అధినేత్రి ఇక ‘ఇన్షా అల్లా’, ‘ఖుదా హఫీజ్’ వంటి వాటిని అనడం మానేశారని ఎద్దేవా చేశారు.
‘‘మంగళవారం ఆమె జానకీనాథ్ ఆలయంలో రాముడి ప్రార్థన చేశారు. అది కూడా చెప్పులు వేసుకుని గుళ్లోకి వెళ్లారు. ఇన్షా అల్లా, ఖుదా హఫీజ్ ను ఆపేసి.. హిందూ ధర్మాన్ని వల్లిస్తున్నారు. హిందూ దేవతలను తిట్టిన సయానీ ఘోష్ కు ఆమె టికెట్ ఇచ్చారు. అలాంటి మమతకు హిందువునని ఇప్పుడే గుర్తొచ్చిందా?’’ అని సువేందు ప్రశ్నించారు. తృణమూల్ పార్టీ.. బూత్ లలోకి చొరబడి రిగ్గింగ్ చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కానీ, తాను ఉన్నంత వరకు అది జరగనివ్వనన్నారు. అన్ని బూత్ ల వద్దకు వెళతానని చెప్పారు.