Bandi Sanjay: కేసీఆర్ భైంసాకు వెళ్లకపోతే... నేనే అక్కడకు వెళ్లి భరోసా యాత్ర చేస్తా: బండి సంజయ్
- భైంసా అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించిన సంజయ్
- హింసోన్మాదం సృష్టించిన ఎంఐఎంకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని మండిపాటు
- ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శ
భైంసాలో ఇటీవల రెండు వర్గాల మధ్య దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో గాయపడి హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ భైంసా బాధితుల పరిస్థితి హృదయవిదారకంగా ఉందని చెప్పారు. వారికి అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వర్గాలతో చర్చించడం జరిగిందని తెలిపారు. భైంసాలో హింసోన్మాదం సృష్టించిన ఎంఐఎంకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.
ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదని దుయ్యబట్టారు. ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ హిందువులపై దాడులకు ప్రోత్సహించడం దుర్మార్గమని అన్నారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భైంసాకు వెళ్లకపోతే... తానే అక్కడకు వెళ్లి భరోసా యాత్ర చేపడతానని హెచ్చరించారు.