Modugula Venugopal Reddy: పక్కాగా టార్గెట్ చేసి నాపై దాడి చేశారు: మోదుగుల
- టీడీపీ దొంగ ఓట్లు వేయించింది
- దీన్ని ప్రశ్నించినందుకే నాపై దాడి చేశారు
- దీని వెనుక పోలీసుల వైఫల్యం కూడా ఉంది
గుంటూరులో మాజీ ఎంపీ, వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నగరంలోని జేకేసీ కాలేజీ వద్ద ఆయన కారుపై టీడీపీ వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆయన కారుతో పాటు, మరో వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఈ నేపథ్యంలో మోదుగుల స్పందిస్తూ, టీడీపీ దొంగ ఓట్లు వేయించడాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని అన్నారు. మహిళలు, విద్యార్థినులతో టీడీపీ దొంగ ఓట్లు వేయించిందని చెప్పారు. పక్కాగా టార్గెట్ చేసే, తనపై దాడి చేశారని మండిపడ్డారు. ఈ దాడి వెనుక గుంటూరు పోలీసుల వైఫల్యం కూడా ఉందని ఆరోపించారు. మరోవైపు ఈ దాడి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.