Ravneet Singh Bittu: లోక్ సభలో కాంగ్రెస్ నేతగా రవ్ నీత్ సింగ్ బిట్టూ నియామకం
- బెంగాల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న అధిర్ రంజన్ చౌధరి
- ప్రస్తుతం లోక్ సభలో కాంగ్రెస్ విప్ గా ఉన్న బిట్టూ
- మాజీ సీఎం బియాంత్ సింగ్ మనవడే బిట్టూ
లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా పంజాబ్ కు చెందిన రవ్ నీత్ సింగ్ బిట్టూను నియమించారు. అధిర్ రంజన్ చౌధరి స్థానంలో ఆయన నిమామకం జరిగింది. అధిర్ రంజన్ పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో, ఆయన ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ గౌరవ్ గొగోయ్ కూడా అసోం ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. దీంతో, లోక్ సభాపక్ష నేతగా బిట్టూను నియమించారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడే రవ్ నీత్ సింగ్ బిట్టూ కావడం గమనార్హం. 45 ఏళ్ల బిట్టూ మూడోసారి ఎంపీగా గెలుపొందారు. 2009లో తొలిసారి ఆనంద్ పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లో లుథియానా నుంచి గెలుపొందారు. గత ఆగస్టులో లోక్ సభలో కాంగ్రెస్ విప్ గా బిట్టూ నియమితులయ్యారు. ఎన్నికల తర్వాత మళ్లీ అధిర్ రంజన్ చౌధరి నాయకత్వ బాధ్యతలను స్వీకరిస్తారు.