Raghu Rama Krishna Raju: చంద్రబాబును విమర్శించే స్థాయి నీకు లేదు!: పెద్దిరెడ్డికి రఘురామ కృష్ణరాజు కౌంటర్

Raghu Rama Krishna Raju Said He Ready To Accept Peddireddy Challenge
  • పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నా
  • అంతకంటే ముందు నా సవాలును స్వీకరించాలి
  • చంద్రబాబు నాకు ఉన్నతస్థానం ఇచ్చారు
తన కాళ్లు పట్టుకుని బతిమాలితేనే తాను వైసీపీలో చేరానని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తాను రాజీనామా చేసి మళ్లీ పోటీచేసి గెలిస్తే జగన్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ పోటీకి దిగాలని, తన ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని అన్నారు.

రఘురామ కృష్ణరాజు ఓ కొమ్ములు లేని దున్నపోతు అని, ఆయనో బ్లాక్‌షీప్ (విశ్వాస ఘాతుకుడు) అని అంతకుముందు పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. రఘురామకు సిగ్గుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాలు విసిరారు. మంత్రి సవాలుపై స్పందించిన రఘురామ రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన సవాలును తాను స్వీరిస్తున్నానని, అయితే,  తాను విసిరే ఈ సవాలును కూడా స్వీకరించాలని రఘురామ ప్రతి సవాల్ విసిరారు.

‘నేను కనుక సీఎం అయితే’ అన్న మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మీ సీఎం అసమర్థుడు, చేతకానివాడు అనేదే ఆ మాటల వెనక ఉన్న ఉద్దేశమా? అని ప్రశ్నించారు. తాను చంద్రబాబుకు బంట్రోతుగా ఉండాల్సిన అవసరం లేదని, రాజకీయంగా చంద్రబాబు తనకు ఉన్నత స్థానం ఇచ్చారని రఘురామ అన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని తెలుసుకోవాలని హితవు పలికారు.

తానెప్పుడూ సీఎం జగన్‌ను విమర్శించలేదని, ఆయన ప్రభుత్వ విధానాలను, తప్పు చేస్తున్న వారిని మాత్రమే విమర్శించానని అన్నారు. జగన్‌, మిథున్‌రెడ్డిల దయవల్లే పెద్దిరెడ్డి మంత్రి అయ్యారని, ఇసుక ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావో అందరికీ తెలుసని పెద్దిరెడ్డిపై రఘురామ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Raghu Rama Krishna Raju
Peddireddi Ramachandra Reddy
YSRCP

More Telugu News