Banks Privatisation: రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకుల మూత
- 13 రెండో శనివారం, 14 ఆదివారం
- సోమ, మంగళవారాల్లో బ్యాంకుల బంద్
- ప్రైవేటీకరణను నిరసిస్తూ యూనియన్ల బంద్ పిలుపు
రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రేపు రెండో శనివారం కాబట్టి మామూలుగానే బ్యాంకుకు సెలవు. ఆదివారం ఎలాగూ మూతే. అయితే, సోమవారం, మంగళవారం కూడా బ్యాంకులు మూతపడబోతున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారాల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. కాబట్టి రేపటి నుంచి వరుసగా అంటే 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్యాంకులు తెరుచుకోవన్నమాటే.
బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసినా, లేదంటే యూనియన్లు సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే తప్ప ఈ నాలుగు రోజులూ బ్యాంకులు మూతపడడం పక్కా అన్నమాటే. అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. బ్యాంకులు మూతలో ఉండే ఈ నాలుగు రోజులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండకపోవడమే. బ్యాంకులు నాలుగు రోజులు మూతపడతాయి కాబట్టి ఏటీఎంలలో నగదు నిల్వలు కూడా కరిగిపోవచ్చు. కాబట్టి అత్యవసరంగా నగదు అవసరమయ్యేవారు ముందుగా మేల్కొనడం మేలు.