Engineering: ఇంజనీరింగ్ కు మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరేం కాదు: ఏఐసీటీఈ

Maths physics not a must for engineering says AICTE
  • ప్రవేశాలకు విద్యార్హతల్లో మార్పులు
  • హ్యాండ్ బుక్ విడుదల చేసిన ఏఐసీటీఈ
  • ఆయా సబ్జెక్టులు ఐచ్ఛికం అని ప్రకటన
  • పేర్కొన్న ఏవైనా 3 సబ్జెక్టులు చదివితే చాలని వెల్లడి
  • విద్యా నిపుణుల నుంచి విమర్శలు
  • నిర్ణయంపై వివరణ ఇచ్చిన ఏఐసీటీఈ
ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్ లో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్ర సబ్జెక్టులను కచ్చితంగా చదివి ఉండాలి. ఇప్పటిదాకా ఉన్న నిబంధన అదే. కానీ, ఇకపై అవేం తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అంటోంది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇంటర్ లో గణితం, భౌతిక శాస్త్ర సబ్జెక్టులను ఐచ్ఛికం చేసింది. ఇంజనీరింగ్ చదివేందుకు అర్హతలకు సంబంధించి విడుదల చేసిన హ్యాండ్ బుక్ లో ఏఐసీటీఈ ఈ విషయాలను వెల్లడించింది.

దాని ప్రకారం విద్యార్థులు ఇంటర్ లో భౌతికశాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, సాంకేతిక వొకేషనల్ కోర్సు, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంట్రప్రెన్యూర్ షిప్ వంటి సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టుల్లో పాస్ అయి ఉంటే ఇంజనీరింగ్ అడ్మిషన్ ను పొందొచ్చు. విద్యార్థులు ఆ మూడు సబ్జెక్టులు కలిపి కనీసం 45% మార్కులు సాధించి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.

అయితే, ఇంజనీరింగ్ కు అవసరమైన గణితం, భౌతిక శాస్త్ర సబ్జెక్టులను ఇంటర్ లో చదవని విద్యార్థుల కోసం ఇంజనీరింగ్ లో బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. ఆ రెండు సబ్జెక్టులతో పాటు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ను విధిగా నేర్పిస్తామని పేర్కొంది. ఏఐసీటీఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి కోర్సు అనేది మ్యాథ్స్ లో వీక్ గా ఉన్న వారిని రాటు దేల్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని శాస్త్రయూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ఎస్. వైద్య సుబ్రహ్మణ్యం అన్నారు. అంతేగానీ, అసలు గణితం చదవని విద్యార్థులకు ఇంజనీరింగ్ చదివే అవకాశం ఇస్తామనడం సరికాదన్నారు.

మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా సైన్స్ లోని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని మద్రాస్ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగాధిపతి రీటా జాన్ అన్నారు. ఆ సబ్జెక్టులు లేకుండా ఇంజనీరింగ్ చదవడమంటే భవిష్యత్ లో నూతన ఆవిష్కరణలకు తావు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ లోని మొత్తం 8 సెమిస్టర్లలో 7 సెమిస్టర్ల వరకూ గణితం తరగతులుంటాయని, అలాంటిది బేసిక్స్ లేకుండా చదవడం మంచిది కాదని అంటున్నారు.

విమర్శలపై ఏఐసీటీఈ స్పందించింది. హ్యాండ్ బుక్ లో ఐచ్ఛికం అని చెప్పలేదని వివరణ ఇచ్చింది. సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉండాలని మాత్రమే పేర్కొన్నామని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ డి. సహస్రబుద్ధ అన్నారు. ఇంజనీరింగ్ లో మరిన్ని అవకాశాలు కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

అయితే, వేరే కోర్సులు చదివి ఇంజనీరింగ్ చేసే వారికి దానికి అవసరమయ్యే సబ్జెక్టులపై శిక్షణనిస్తామన్నారు. ఉదాహరణకు ఓ విద్యార్థి ఇంటర్ లో మ్యాథ్స్ చదవకపోతే.. ఇంజనీరింగ్ ఫస్టియర్ లో ఎక్కువగా ఆ సబ్జెక్ట్ పైనే ఫోకస్ పెడతామన్నారు. నేరుగా సెకండియర్ లోకి వచ్చే డిప్లొమా విద్యార్థులకూ మ్యాథ్స్ కోర్సులను ఎక్కువగా పెడతామని వివరించారు.
Engineering
Physics
Mathematics
Chemistry
AICTE

More Telugu News