Nara Lokesh: ఇందుకు జగన్ రెడ్డి చెత్త పరిపాలనే కారణం: లోకేశ్ విమర్శలు
- జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మునిగి తేలుతోంది
- మరోవైపు అన్నదాతలు అప్పులపాలై నేలకొరుగుతున్నారు
- ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రైతు సంజీవరెడ్డి దంపతుల ఆత్మహత్య
- ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారన్న లోకేశ్
వైసీపీ ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో ఆ పార్టీ తీరును ప్రశ్నిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఒక పక్క వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మునిగి తేలుతుంటే, మరోపక్క అన్నదాతలు అప్పులపాలై నేలకొరుగుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకున్న దంపతులు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందక ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలచివేసింది' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
'ఆళ్లగడ్డ నియోజకవర్గం పి.చింతకుంట గ్రామంలో రైతు సంజీవరెడ్డి దంపతులు వ్యవసాయ పెట్టుబడి కోసం తీసుకున్న 11 లక్షలు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు. వారి ముగ్గురు పిల్లలు అనాథలుగా మారడానికి జగన్ రెడ్డి చెత్త పరిపాలనే కారణం' అని లోకేశ్ విమర్శలు గుప్పించారు
'ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే జగన్ రెడ్డి నిద్రలేస్తాడు? సంజీవరెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. రైతులకు భరోసా కల్పించాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.