New Delhi: ఢిల్లీలో మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షం
- బలమైన ఈదురు గాలులతో జల్లులు
- పశ్చిమ గాలుల వల్లే వర్షాలన్న ఐఎండీ
- ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల దాకా పడిపోతాయని వెల్లడి
- వడగండ్లు పడే అవకాశం ఉందని ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పశ్చిమ నుంచి వీస్తున్న గాలుల ఫలితంగానే ఢిల్లీలో వాన పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శాస్త్రవేత్తలు చెప్పారు.
శుక్రవారం అంతా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని ఐఎండీ ప్రాంతీయ కేంద్రం చీఫ్ కుల్దీప్ శ్రీవాస్తవ చెప్పారు. బలమైన గాలులు వీస్తాయన్నారు. ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల దాకా పడిపోతాయన్నారు. కాగా, బుధవారం సాయంత్రం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
గురువారం ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.2 డిగ్రీలు రికార్డ్ అయిందని, అది సాధారణం కన్నా ఆరు డిగ్రీలు ఎక్కువని ఐఎండీ తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలని, మామూలు కన్నా 3 డిగ్రీలు అధికమని పేర్కొంది. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఇక, వడగళ్ల వాన కురిసే అవకాశమూ ఉందని పేర్కొంది.