Maharashtra: మహారాష్ట్రలో కరోనా పంజా.. అకోలా, పర్బణి జిల్లాల్లో లాక్ డౌన్, పూణెలో రాత్రి కర్ఫ్యూ విధింపు!
- మహారాష్ట్రలో పలు జిల్లాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
- నాగ్ పూర్ జిల్లాలో నిన్ననే లాక్ డౌన్ విధింపు
- పూణెలో రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు నైట్ కర్ఫ్యూ
మహారాష్ట్రలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ పంజా విసురుతుండటంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది.
ఇందులో భాగంగా నిన్న నాగ్ పూర్ జిల్లాలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని జిల్లాల్లో కూడా లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిన్న ప్రకటించారు. ఆయన చెప్పినట్టే మహా ప్రభుత్వం ఈరోజు మరిన్ని కీలక చర్యలు తీసుకుంది. అకోలా, పర్బణి లాక్ డౌన్, పూణెలో నైట్ కర్ఫ్యూ విధించింది.
అకోలాలో ఈ రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ప్రకటించింది. పూణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూని విధించారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ అవుతాయి. బార్లు, రెస్టారెంట్లను రాత్రి 10 వరకు 50 శాతం కెపాసిటీతో నిర్వహించుకోవచ్చు. మార్కెట్లు, మాల్స్, సినిమా హాల్స్ అన్నింటినీ రాత్రి 10 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు, కాలేజీలను మార్చి 31 వరకు మూసివేశారు.
పర్బణి జిల్లాలో ఈ రాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టు మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్ నవాబ్ మాలిక్ తెలిపారు. పర్బణి జిల్లా, దాన్ని ఆనుకున్న జిల్లాల ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని ఆయన కోరారు.