Asaduddin Owaisi: సెక్యులరిజాన్ని కాపాడే బాధ్యత ముస్లింలదేనా?: అసదుద్దీన్ ఒవైసీ
- ముస్లింలను మోసం చేసేందుకు ఆ పదాన్ని వాడుకుంటున్నారు
- ముస్లింల వెనుకబాటుకు కాంగ్రెస్, బీజేపీలే కారణం
- ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2021 (సౌత్)లో ఒవైసీ
సెక్యులరిజం పేరుతో రాజకీయ పార్టీలన్నీ దేశంలోని మైనారిటీలను మోసగిస్తున్నాయని ఎంఐఎం చీప్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. చెన్నైలో జరుగుతున్న ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2021 (సౌత్)లో పాల్గొన్న ఆయన ‘సెక్యులర్ సెర్మన్స్: ఫ్రమ్ కాన్‌స్టిట్యూషన్ టు కాన్‌స్టిట్యూషన్’ అనే అంశంపై మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ పార్టీలపై దుమ్మెత్తి పోశారు. సెక్యులరిజం పదాన్ని రాజకీయ పార్టీలన్నీ దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. దానిని ఓ అవకాశవాద వస్తువుగా ఉపయోగించుకుని మైనారిటీలను పార్టీలన్నీ మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
సెక్యులరిజాన్ని మోసే బాధ్యత ఎప్పుడూ ముస్లింల నెత్తినే పెడుతున్నారన్న హైదరాబాద్ ఎంపీ ముస్లింల వెనకబాటుకు కాంగ్రెస్, బీజేపీలు రెండూ కారణమేనన్నారు. ‘‘ఓ పార్టీ సెక్యులరిజంపై భయాన్ని సృష్టిస్తుంది.. అది బీజేపీ. మరో పార్టీ తప్పుడు ఆశలు రేకెత్తిస్తుంది.. అది కాంగ్రెస్’’ అని తీవ్ర విమర్శలు చేశారు. తమ నాయకత్వాన్ని సోకాల్డ్ పార్టీలేవీ గుర్తించవన్న విషయాన్ని ముస్లింలు గుర్తించడం వల్లే ఎన్నికల బరిలోకి దిగాలని తాము నిర్ణయించుకున్నట్టు ఒవైసీ పేర్కొన్నారు.