Virat Kohli: ...లేదంటే కోహ్లీలా మీరూ డకౌట్ అవుతారు: ఉత్తరాఖండ్ పోలీసుల సందేశం
- తొలి టీ20లో కోహ్లీ డకౌట్ అయిన ఫొటో ట్వీట్
- హెల్మెట్ ఒక్కటే ఉంటే సరిపోదంటూ కామెంట్
- వాహనాన్ని శ్రద్ధగా నడపాలని సూచన
చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలవ్వడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వంటి వాటి వల్లే ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయన్నది అందరికీ తెలిసిన సత్యం.
మరణాలను తగ్గించేందుకు వాహనదారులు హెల్మెట్ పెట్టుకునేలా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ను మానేలా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ముక్కుపిండి జరిమానాలు వసూలు చేస్తున్నా చాలా మంది హెల్మెట్ ను బరువులా భావిస్తున్నారు. అందుకే ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు.
శుక్రవారం ఇంగ్లండ్ఇం తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. 5 బంతులు ఆడిన కోహ్లీ.. ఓ నిర్లక్ష్యపు షాట్ కు వికెట్ పారేసుకున్నాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఆ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ పోలీసులు.. ‘‘హెల్మెట్ ఒక్కటే పెట్టుకుంటే సరిపోదు! వాహనాన్ని పూర్తి శ్రద్ధతో నడపాలి. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తే మీరూ కోహ్లీలా డకౌట్ అయిపోతారు’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, మ్యాచ్ లో ఇండియాను ఇంగ్లండ్ఇం 8 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే.