Rahul Gandhi: అందరూ కుదేలైతే అదాని సంపద మాత్రం పెరిగింది... ఎలా?: రాహుల్ గాంధీ
- 2021లో ఆదాయం పరంగా మస్క్, బెజోస్ ను మించిన అదాని
- ఆశ్చర్యం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
- కరోనా సంక్షోభ సమయంలో ప్రజల ఆదాయం సున్నా అని వెల్లడి
- కానీ అదాని ఆదాయం 50 శాతం పెరిగిందన్న రాహుల్
కరోనా సంక్షోభం సమయంలో ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ ఆదాయంలో క్షీణత కనిపించినా, భారత సంపన్నుడు గౌతమ్ అదానీ మాత్రం 16.2 బిలియన్ డాలర్ల ఆదాయంతో 2021లో అత్యధికంగా ఆర్జించినవారిలో నెంబర్ వన్ గా నిలిచాడు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విస్మయం వ్యక్తం చేశారు. కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరూ విలవిల్లాడుతుంటే అదాని మాత్రం 50 శాతానికి పైగా తన సంపదను ఎలా పెంచుకోగలిగాడని సందేహం వ్యక్తం చేశారు.
"2020లో మీరు ఎంత సంపదను పెంచుకోగలిగారు?... అందుకు జవాబు సున్నా అనే చెప్పాలి. మీరోవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే ఇతను మాత్రం తన సంపదను 50 శాతం మేర పెంచుకున్నాడు. ఇది ఏ విధంగా సాధ్యమైందో నాకు చెప్పగలరా?" అంటూ ప్రజలను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
రాహుల్ ఇటీవల తరచుగా, ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ... ప్రధాని కేవలం తన కార్పొరేట్ మిత్రుల కోసమే పనిచేస్తున్నాడని వ్యాఖ్యానించడం తెలిసిందే. అదానీలు, అంబానీలకే ఆయన ప్రధాని అని విమర్శించారు.