Non veg pizza: నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేసినందుకు కోటి రూపాయలు చెల్లించాలంటూ ఫిర్యాదు చేసిన మహిళ
- వెజ్ పిజ్జా ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ డెలివరీ చేసిన ఔట్ లెట్
- తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామన్న మహిళ
- మత విశ్వాసాలకు విఘాతం కలిగిందని ఆవేదన
వెజిటేరియన్ పిజ్జాను ఆర్డర్ చేస్తే నాన్ వెజిటేరియన్ పిజ్జాను డెలివరీ చేసినందుకు అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ చైన్ ఔట్ లెట్ రూ. 1 కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన దీపాలి త్యాగి అనే మహిళ కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది.
ఆ వివరాల్లోకి వెళ్తే, ఘజియాబాద్ లో నివాసం ఉండే దీపాలి 2019 మార్చి 21న వెజిటేరియన్ పిజ్జాను అమెరికన్ పిజ్జా ఔట్ లెట్ ద్వారా ఆర్డర్ చేసింది. ఆరోజు హోలీ పండుగ. హోలీ వేడుకల తర్వాత ఆమె, ఆమె పిల్లలు చాలా ఆకలిగా ఉన్నారు. పిజ్జాను ఆర్డర్ చేసిన తర్వాత డెలివరీ చేయడంలో కూడా సదరు సంస్థ లేట్ చేసింది. అయినప్పటికీ ఆకలితో ఉండటం వల్ల వారు దాన్ని పట్టించుకోలేదు. పిజ్జాను ఆరగించడం మొదలు పెట్టారు.
అయితే పిజ్జాలో ఉన్న ముక్కలను వారు మష్రూమ్స్ (పుట్టగొడుగులు) అనుకున్నారు. అసలు విషయాన్ని గ్రహించేలోగానే వారు పిజ్జాను సుమారుగా ఆరగించేశారు. అది నాన్ వెజ్ అని తెలిసిన తర్వాత షాక్ కు గురయ్యారు. మత విశ్వాసాలకు తాము ఎంతో ప్రాధాన్యతను ఇస్తామని... అలాంటిది తమకు మాంసాహారాన్ని అందించి తమ విశ్వాసాలకు విఘాతం కలిగించారని ఫిర్యాదులో దీపాలి పేర్కొన్నారు.
దీంతో తాము ఎంతో మనోవేదనకు గురయ్యామని చెప్పారు. తనకు కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఈ ఫిర్యాదును విచారించిన కోర్టు... దీపాలి ఫిర్యాదుకు సమాధానాన్ని ఇవ్వాలని సదరు ఔట్ లెట్ ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చ్ 17కి వాయిదా వేసింది.