Dayanidhi Maran: రాజకీయాల్లోకి వచ్చాక కమల్ ఎంతో వేగంగా రంగులు మార్చుతున్నాడు: దయానిధి మారన్
- కమల్ ను సినిమాల్లో అందరూ ఇష్టపడతారు
- బీజేపీకి బీ-టీమ్ లా వ్యవహరిస్తున్నాడు
- కమల్ కు అమిత్ షా, మోదీ బాసులు
- ప్రభుత్వం కూడా బీజేపీ నీడలోనే సాగుతోందన్న మారన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షాలు విమర్శలకు పదును పెంచాయి. ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ రాజకీయాల్లో రంగులు మార్చుతున్నాడని డీఎంకే నేత దయానిధి మారన్ విమర్శించారు. కమల్ తన సిగ్గుమాలిన చర్యలతో బీజేపీకి బీ-టీమ్ లా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు.
కమల్ ను ఎంతోకాలంగా తమిళ ప్రజలు గమనిస్తున్నారని, రజనీకాంత్ లా సూపర్ స్టార్ కాకపోయినా, ప్రతి ఒక్కరూ ఆయనను ఇష్టపడతారని మారన్ వెల్లడించారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక కమల్ ఎంతో వేగంగా రంగులు మార్చుతున్నాడని, అందుకు కారణాలేంటో తమకు తెలుసని అన్నారు.
అధిష్ఠానం (బీజేపీ) నుంచి ఆయనకు సూచనలు అందుతున్నాయని, అందుకే ఓ దశలో రజనీకాంత్ ప్రారంభించబోయిన పార్టీతో తన పార్టీని విలీనం చేసేందుకు కూడా సిద్ధపడ్డాడని మారన్ ఆరోపించారు. ఇప్పుడు రజనీకాంత్ ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నాడో, ఏ పార్టీలో చేరబోతున్నాడో అందరికీ తెలుసని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కమలహాసన్ పాత్ర ఏంటన్నది ఆయన బాసులు అమిత్ షా, నరేంద్ర మోదీలను అడగాలని స్పష్టం చేశారు.
ఇక, తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వం కూడా బీజేపీ నీడలోనే సాగుతోందని దయానిధి మారన్ పేర్కొన్నారు. అన్నాడీఎంకేను ఉపయోగించుకుని ఆర్ఎస్ఎస్ భావజాలాన్నంతా తమిళనాడుపై రుద్దుతున్నారని ఆరోపించారు.