Grandhi Srinivas: పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే
- ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా
- జనసేనానిపై విమర్శలు గుప్పించిన గ్రంధి శ్రీనివాస్
- పవన్ పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావించిన వైనం
- రాజకీయాల్లో అలా కుదరదని వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తెరగాలని అన్నారు. వరుసగా విడాకులు తీసుకుంటూ ఎన్ని వివాహాలు అయినా చేసుకోవచ్చని, కానీ రాజకీయాల్లో అలా కుదరదని తెలిపారు. రాజకీయాలకు సిద్ధాంతాలు, విలువలే ప్రాతిపదిక అని గ్రంధి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులను మోసం చేసిన పవన్... ఆపై టీడీపీతో కలిసినా, ఆ పార్టీ నుంచి కూడా విడిపోయారని వెల్లడించారు. ఇప్పుడు బీజేపీతో కలిసిన పవన్ కిందిస్థాయిలో మాత్రం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుల నీచ రాజకీయాలను ప్రజలు గుర్తించారు కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని విమర్శించారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పవన్ పై గెలిచింది గ్రంధి శ్రీనివాసే.