YSRCP: కడప కార్పొరేషన్ వైసీపీ కైవసం... ఒక్క డివిజన్ తో సరిపెట్టుకున్న టీడీపీ
- వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
- కడప, కర్నూలు కార్పొరేషన్లలో జెండా ఎగరేసిన వైసీపీ
- కడపలో 48, కర్నూలులో 41 డివిజన్లలో విజయం
- సింగిల్ డిజిట్ కు పడిపోయిన టీడీపీ
- కడపలో 1, కర్నూలులో 8 డివిజన్లలో గెలుపు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంది. క్రమంగా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడవుతున్నాయి. సర్వత్రా ఆసక్తి కలిగించిన కడప నగరపాలక సంస్థను వైసీపీ చేజిక్కించుకుంది. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, వైసీపీ తిరుగులేని రీతిలో 48 డివిజన్లలో విజయభేరి మోగించింది.
టీడీపీ ఒక్క డివిజన్ తో సంతృప్తి పడింది. ఇతరులకు ఒక డివిజన్ లో విజయం లభించింది. అటు కర్నూలు కార్పొరేషన్ ను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు నగరపాలక సంస్థలో 52 డివిజన్లు ఉండగా, వైసీపీ 41 స్థానాల్లో నెగ్గగా, టీడీపీకి 8, స్వతంత్ర అభ్యర్థులకు 3 స్థానాలు లభించాయి.