Prithvi Shaw: మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిన పృథ్వీ షా... విజయ్ హజారే ట్రోఫీలో రికార్డు
- ఢిల్లీలో ముంబయి వర్సెస్ ఉత్తరప్రదేశ్
- విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
- మొదట బ్యాటింగ్ చేసి 312 పరుగులు చేసిన యూపీ
- లక్ష్యఛేదనలో విరుచుకుపడిన పృథ్వీ షా
- 39 బంతుల్లోనే 73 పరుగులు
- టోర్నీలో 827 పరుగులతో రికార్డు
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన పృథ్వీషా... విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం ఆకాశమే హద్దులా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో 4 భారీ సెంచరీలు నమోదు చేసిన ఈ ముంబయి చిచ్చరపిడుగు ఫైనల్లోనూ ఉతికారేశాడు. ఉత్తరప్రదేశ్ జట్టుతో ఢిల్లీలో జరిగిన టైటిల్ సమరంలో పృథ్వీ షా 39 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. తద్వారా హేమాహేమీలకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 800కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో షా మొత్తం 827 పరుగులు నమోదు చేయడం విశేషం.
ఇక, నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే... భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ముంబయి జట్టే గెలిచింది. యూపీ విసిరిన 313 పరుగుల విజయలక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. ఓపెనర్ మాధవ్ కౌశిక్ 156 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సులతో 158 పరుగులు సాధించాడు.
అనంతరం లక్ష్యఛేదనలో కెప్టెన్ పృథ్వీ షా విజృంభణకు తోడు వికెట్ కీపర్ ఆదిత్య తారే సెంచరీ ముంబయి జట్టును విజయం దిశగా నడిపించింది. తారే 107 బంతుల్లో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తారే స్కోరులో 18 ఫోర్లున్నాయి. యువ ఆటగాడు శివమ్ దూబే చివర్లో 28 బంతుల్లో చకచకా 42 పరుగులు చేసి జట్టును విజయం ముంగిట నిలిపాడు. కాగా, ఇది ముంబయికి నాలుగో విజయ్ హజారే టైటిల్.