YSRCP: అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్లలో వైసీపీ జెండా రెపరెపలు

YCP gets some more corporations

  • ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం
  • కార్పొరేషన్లలో దూకుడు
  • తాజాగా మరికొన్ని కార్పొరేషన్లు వైసీపీ కైవసం
  • ఒంగోలు, తిరుపతి కార్పొరేషన్లు వైసీపీ పరం
  • మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా అధికార వైసీపీ మరో రెండు నగరపాలక సంస్థలను కైవసం చేసుకుంది. అనంతపురం, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీ గెలుపొందింది. అనంతపురం కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లకు గాను వైసీపీ 48 స్థానాల్లో జయభేరి మోగించింది. టీడీపీకి ఒక్క స్థానం కూడా రాకపోగా, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 డివిజన్లు సొంతం చేసుకున్నారు. చిత్తూరు కార్పొరేషన్ లో 50 డివిజన్లలో వైసీపీ 46 డివిజన్లు గెలుచుకోగా... టీడీపీకి 3, ఇతరులకు 1 స్థానం దక్కాయి.

ఇక తిరుపతి కార్పొరేషన్ లోనూ ఇదే రీతిలో ఫలితాలు వచ్చాయి. తిరుపతి కార్పొరేషన్ లో 49 డివిజన్లు ఉండగా, వైసీపీ 48 గెలుచుకుని మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. టీడీపీకి ఒక డివిజన్ దక్కింది. అటు, ఒంగోలు నగరపాలక సంస్థ కూడా వైసీపీ వశమైంది. మొత్తం 50 డివిజన్లలో వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు. మచిలీపట్నం, విజయవాడ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News