Vijayashanti: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు వేసిందీ హోం మంత్రి వెల్లడించారు... ఆయన ఓటు చెల్లదు: విజయశాంతి

Vijayasanthi fires on home minister Mahmood Ali

  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హోంమంత్రిపై ధ్వజం
  • తానే పార్టీకి ఓటేశారో ఆయన మీడియాకు చెప్పారు 
  • ఎన్నికల నియమావళిని కాలరాశారన్న విజయశాంతి
  • అధికారులు ఇంకా పిర్యాదు కోసం చూడడంపై ఆశ్చర్యం

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన హోం మంత్రి మహమూద్ అలీ తాను ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాననేది బహిరంగంగా ప్రకటించారని, ఇది ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కడమేనని విజయశాంతి విమర్శించారు.

హోం మంత్రి ఓటు చెల్లదని ఆమె స్పష్టం చేశారు. హోం మంత్రిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఆర్వో నుంచి ఫిర్యాదు అందించిన వెంటనే ఓటుపై పరిశీలిస్తామని అధికారులు తెలిపినట్టు వెల్లడించారు. అయితే, తాను ఎవరికి ఓటేశాడో హోం మంత్రే స్వయంగా మీడియాకు చెప్పిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు కోసం ఎదురుచూడడం ఏంటో అర్థం కావడంలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక, లోక్ సభ సభ్యులు, ఎమ్మెల్యేల ఎన్నికలకు వ్యయ పరిమితిని విధించిన ఎన్నికల సంఘం, ఎమ్మెల్సీల విషయంలో అలాంటిదేమీ విధించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ కోట్లు కుమ్మరించిందని విజయశాంతి ఆరోపించారు. ప్రకటనలు, ప్రచారం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేశారని వెల్లడించారు.

అటు, భైంసా ఘటనపై ఆమె స్పందిస్తూ... రాజ్యాంగ వ్యవస్థలంటే తెలంగాణ సీఎంకు, మంత్రులకు ఏమాత్రం పట్టదని విమర్శించారు. పాలనను గాలికొదిలేశారని, తరచుగా హింసకు గురవుతున్న భైంసా పట్టణమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. హత్యలు, దాడులతో భైంసా ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిని గుర్తుకు తెస్తున్నాడని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News