Corona vaccine: మా టీకా వల్ల రక్తం గడ్డకడుతున్నట్లు రుజువులు లేవు: ఆస్ట్రాజెనెకా

No evidence for Blood clot due to corona vaccine

  • ప్రజలు, వైద్య వర్గాల్లో వ్యక్తమవుతున్న ఆందోళన 
  • వాడకాన్ని నిలిపివేసిన పలు ఐరోపా దేశాలు
  • ఆ సమస్యలను వ్యాక్సిన్‌తో ముడిపెట్టవద్దన్న సంస్థ  
  • భద్రతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తున్నామని వివరణ  

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతున్నట్లు (బ్లడ్ క్లాట్స్) వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని ఐరోపా దేశాలు ఈ టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. మరోవైపు ప్రజలు, వైద్య వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

దీనిపై తాజాగా ఆస్ట్రాజెనెకా స్పందించింది. తమ టీకా సురక్షితమేనని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. సాధారణ సమయంలోనూ రక్తంలో సమస్యలు ఏర్పడతాయని, వాటిని వ్యాక్సిన్‌తో ముడిపెట్టవద్దని పేర్కొంది. వ్యాక్సినేషన్‌ అనంతరం చాలా మందిలో రక్తం గడ్డకడుతోందని వస్తోన్న ఆరోపణలకు రుజువులు లేవని చెప్పింది. నాణ్యత, భద్రతతో కూడిన వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నామని తెలిపింది.

టీకాల కొరత కారణంగా ఇప్పటికే ఐరోపా దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. దీనికి తోడు తాజా అనారోగ్య సమస్యల ఘటనలు టీకా కార్యక్రమంపై మరింత ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే.. ఐరోపా సమాఖ్య(ఈయూ) ఔషధ నియంత్రణ సంస్థ మాత్రం టీకాతో ఉన్న దుష్ప్రభావాల కంటే దాని వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువని స్పష్టం చేసింది.

మరోవైపు భారత్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో 'కోవిషీల్డ్' పేరిట ఉత్పత్తి అయిన ఆస్ట్రాజెనెకా టీకాను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రక్తం గడ్డ కడుతుందన్న వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. దీనిపై స్పందించిన భారత్.. దేశంలో వినియోగిస్తున్న రెండు టీకాలను మరింత లోతుగా అధ్యయనం చేస్తామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News