TDP: తాడిపత్రిలో రసవత్తరంగా చైర్మన్ ఎన్నిక.. టీడీపీ, వైసీపీలకు సమానబలం
- టీడీపీ 18, వైసీపీ 16 వార్డుల్లో గెలుపు
- ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో ఓట్లు వేయలేరన్న అధికారి
- ఎమ్మెల్యేల ఓటుతో ఇరు పార్టీల బలాలు సమానం
- కీలకంగా మారిన స్వతంత్ర, సీపీఐ అభ్యర్థులు
అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 18 వార్డుల్లో విజయం సాధించగా, వైసీపీ 16 వార్డుల్లో గెలుపొందింది. అయితే, ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవచ్చని వైసీపీ భావించింది. ఈ క్రమంలో, తాము ఓటింగులో పాల్గొంటామంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైసీపీ తరపున ఓటు వేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి చేసిన విజ్ఞప్తిని తాడిపత్రి పురపాలక సంఘం ఎన్నికల అధికారి నరసింహప్రసాద్‌రెడ్డి తిరస్కరించారు. పురపాలక సంఘం నిబంధనల మేరకే తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. దీంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.
అయితే, ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు అర్హులని చెప్పడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఓట్లతో వైసీపీ బలం 18కి పెరిగింది. టీడీపీ బలం కూడా 18 కావడంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో ఇక్కడి నుంచి గెలిచిన సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరిపైకి అందరి దృష్టి మళ్లింది. ఇప్పుడు వీరిద్దరు ఎటువైపు నిలిస్తే వారికే చైర్మన్ పీఠం దక్కుతుంది. మరోవైపు, ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు టీడీపీ తమ కౌన్సిలర్లు అందరినీ ప్రత్యేక శిబిరానికి తరలించింది.