North Korea: హాయిగా నిద్రపోవాలనుకుంటే ముందు పిచ్చి పనులు మానండి!: అమెరికాకు కిమ్​ సోదరి హెచ్చరిక

If you wish to sleep well it would be better Kim Jong Un sister warns US
  • దక్షిణ కొరియాతో అమెరికా సైనిక విన్యాసాలు 
  • అది తమపై దాడికి సంకేతాలన్న యో జోంగ్
  • యుద్ధాన్నే కోరుకుంటున్నారని ఆగ్రహం
అమెరికాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. హాయిగా నిద్రపోవాలనుకుంటే పిచ్చి పిచ్చి పనులను మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ లు జపాన్, దక్షిణ కొరియా పర్యటనలను ప్రారంభించారు. సోమవారం జపాన్ చేరుకున్న మంత్రుల బృందం.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆమె ఉత్తర కొరియా అధికారిక పత్రిక అయిన రొడోంగ్ సిన్మన్ తో మాట్లాడుతూ, అమెరికాపై ఆ వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ పేరును ప్రస్తావించకుండానే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. “మా నేల, నీటి మీద విషం చిమ్మాలని చూస్తున్న అమెరికాకు, ఆ దేశ కొత్త ప్రభుత్వానికి నేనో మాట చెప్పదలచుకున్నా. రాబోయే నాలుగేళ్లు హాయిగా నిద్రపోవాలనుకుంటే.. పిచ్చి పిచ్చి పనులను చేయడం మానుకోవాలి’’ అంటూ కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.

దక్షిణ కొరియాతో కలిసి సైనిక విన్యాసాలు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తేల్చి చెప్పారు. అది ఉత్తర కొరియాపైన దాడికి సంకేతాలేనని అన్నారు. దక్షిణ కొరియా ‘యుద్ధ పథం’, ‘సంక్షోభ పథం’ దిశగా సాగేందుకే ఆసక్తి చూపిస్తోందని మండిపడ్డారు. కాగా, ఉత్తర కొరియాపై విధాన నిర్ణయాలను సిద్ధం చేసినట్టు బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. వాటిని వచ్చే నెలలో ఆవిష్కరించే అవకాశం ఉంది.
North Korea
South Korea
USA
Kim Jong Un
Kim Yo Jong
Joe Biden

More Telugu News